రేషన్ లబ్ధిదారులకు గుడ్న్యూస్ .. 3 నెలల బియ్యం పంపిణీ గడువు పొడిగింపు
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందిస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ గడువును మరో ఐదు రోజుల పాటుపొడిగించింది. దీంతో ఇప్పటివరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను తీసుకోలేకపోయిన అర్హులైన లబ్ధిదారులకు మరికొంత సమయం లభించింది. తాజా నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ కొనసాగనుంది.వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఆగస్ట్ 1వ తేదీన ప్రారంభమైంది. తొలుత ఆగస్ట్ 31వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేయాలని అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరిగింది. దీంతో కొందరు కార్డుదారులు తమకు కేటాయించిన కోటాను నిర్ణీత సమయంలో తీసుకోలేకపోయారు.మరోవైపు.. రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లారు. దీంతో రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకునే అవకాశం చాలామందికి లేకుండా పోయింది. చివరి రోజుల్లో రేషన్ షాపుల వద్ద రద్దీ కూడా పెరగడంతో పంపిణీ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ.. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మూడు నెలల బియ్యం కోటాను కోల్పోకూడదనే ఉద్దేశంతో గడువును పొడిగించింది.తాజాగా పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రేషన్ దుకాణాల్లో 3 నెలల బియ్యం కోటాను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు రేషన్ సరుకులు తీసుకోని అర్హులైన కార్డుదారులు ఈ అదనపు గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత బియ్యం పంపిణీపై మరింత అవకాశం ఉండకపోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు





