© 2026 nimisham.in
గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీ స్థాయికి చేరిన విషయం తెలిసిందే.
తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో నిర్వహించిన భూముల బహిరంగ వేలం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలు పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు తెలంగాణ హౌసింగ్ బోర్డు తాజాగా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలానికి ముందుగా చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీ పడటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వేలంలో ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్‌కు గజం రూ.2.36 లక్షల ధర పలికింది. మరో 2 ప్లాట్లు చదరపు గజం రూ.2.06 లక్షల చొప్పున విక్రయం అయ్యాయి. దీంతో కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.ఈ బహిరంగ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు వారు పోటీపడటంతో పలు ప్లాట్లు హౌసింగ్ బోర్డు నిర్ణయించిన కనీస ధర కంటే అధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. వేలం పూర్తి అయ్యే సమయానికి 16 ప్లాట్లకు కలిపి చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ప్రాంతానికి ఇప్పటికే ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ గుర్తింపు ఉంది. నగరంలోని ప్రధాన ఐటీ, వాణిజ్య ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, మెట్రో సహా రవాణా సదుపాయాలు, నివాస ప్రాంతంగా ఉన్న డిమాండ్ వంటి అంశాలు ఈ ప్రాంతంలో భూములకు విలువ పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వివాదాలు లేని, అభివృద్ధి చెందిన లేఅవుట్లలోని ప్లాట్లకు కొనుగోలుదారుల నుంచి ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలంలో కూడా బిడ్డర్లు భారీగా ధరలు చెల్లించేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.ఇక ఈ భూముల వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. వేలానికి ముందు ఆగస్ట్ 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. కేపీహెచ్‌బీ ప్లాట్లకు కొనుగోలుదారుల నుంచి ఇప్పటికీ భారీ డిమాండ్ ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం పేర్కొన్నారు. తాజా వేలం ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయని తెలిపారు. బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు వచ్చిన ఆదాయం సంస్థ ఆర్థిక వనరులను పెంచడంలో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత వేగంగా మారుతుందో కేపీహెచ్‌బీ వేలం మరోసారి చూపించింది. గజం రూ.1.60 లక్షల కనీస ధరతో ప్రారంభమైన బిడ్డింగ్.. ఏకంగా రూ.2.70 లక్షలకు చేరడం విశేషం. అంటే నిర్ణయించిన కనీస ధరతో పోలిస్తే గరిష్ఠ ధర భారీగా పెరిగింది. ఐటీ కారిడార్లు, మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో భూములకు డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కేపీహెచ్‌బీ వేలం ఫలితాలు నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.