© 2026 nimisham.in
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే, మరోవైపు.. కేంద్రమంత్రులతో సమావేశం అవుతున్నారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న రక్షణ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు, అలాగే హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026, రక్షణ ఎక్స్పో-2026పై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో చర్చించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రక్షణ ఎక్స్పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు కేంద్ర రక్షణశాఖ సహకారం అందించాలని కోరారు. ఎయిర్‌షోకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలని.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్‌పోలో ప్రదర్శించాలని కోరారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలతో పాటు డీఆర్డీవోకు చెందిన ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ డిఫెన్స్ టెక్నాలజీని ప్రదర్శించేలా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించాలని కోరారు.మరోవైపు.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపైనా సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఇప్పటికే అంగీకరించిందని కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల పాటు కేటాయించే ప్రతిపాదన ఉందని తెలిపారు. అవసరమైతే మరో 2 సార్లు లీజును పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అంశాన్ని కూడా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ మంత్రితో చర్చించారు. విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని తెలిపారు. రక్షణశాఖ మొత్తం 1,500 ఎకరాల భూమిని కోరిన నేపథ్యంలో మిగిలిన మరో 750 ఎకరాలను కూడా సేకరించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.దేవరకద్రలో రక్షణ పరిశోధన ప్రాజెక్టు, ఆదిలాబాద్ విమానాశ్రయం, హైదరాబాద్‌లో రక్షణ ఎక్స్పో వంటి అంశాలపై కేంద్రంతో సమన్వయం ద్వారా తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు మరింత ఊతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరీ ముఖ్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను పెట్టుబడులకు కీలక వేదికగా మార్చడంతో పాటు రక్షణ రంగంలో తెలంగాణకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.