© 2026 nimisham.in

బర్తరఫ్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు నా కుమార్తె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? మంత్రి పదవి నుంచి తొలగింపుపై రేవంత్‌కు సూటి ప్రశ్న నేను ఎమ్మెల్యే గా కొనసాగుతా..
నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తా Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనను కేబినెట్ నుంచి తొలగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని కొండా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు నిర్ణయం తీసుకునే ముందు కనీసం తన వివరణ తీసుకోవాల్సిందని అన్నారు. ముఖ్యంగా తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి తొలగింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూతురు వ్యాఖ్యలకు తనను శిక్షించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని : “రాజీనామా చేయమంటే నేనే చేసేదాన్ని.. నేను తప్పు చేసి ఉంటే బర్తరఫ్ చేసినా బాగుండేది. కానీ, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలగించడం బాధాకరం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఒక ఆభరణం మాత్రమేనని, గతంలోనూ పదవికి తన చేతులతోనే రాజీనామా చేసిన సందర్భం ఉందని కొండా సురేఖ గుర్తుచేశారు. తాను పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌లోనే పలువురు నేతలు పార్టీపై, అగ్రనేతలపై విమర్శలు చేసిన సందర్భాలను ప్రస్తావించారు. తన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారని విమర్శించారు. Read Also : Konda Surekha : పదవి ఉంది.. పవర్ లేదు! హైకమాండ్‌కు కొండా సురేఖ సంచలన లేఖ ఆ నేత వ్యాఖ్యలపై చర్యలేంటి? : మరోవైపు, పార్టీలో ఇతర నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అధిష్ఠానం తీసుకున్న చర్యలపై కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపైనా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని గుండెపై చేయి వేసుకుని చెప్పాలన్నారు. మంత్రులంతా బయటకు వచ్చి మాట్లాడాలని అన్నారు. ప్రజలకు పనులు కావాలంటే ఎవరిని సంప్రదించాలో కూడా అర్థంకాని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీలను సమర్థంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తిరిగి ప్రజల మద్దతు పొందాలంటే మార్పులు అవసరమని సురేఖ అభిప్రాయపడ్డారు. ఇంకా ప్లాన్ - బీ ఏం అనేది అనుకోలేదు : నిర్ణయాలు ఏకపక్షంగా కాకుండా చర్చలతో తీసుకోవాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్లాన్-బీ ఇంకా ఆలోచించలేదన్నారు. రేవంత్‌రెడ్డితో తనకున్న రాజకీయ అనుబంధాన్ని సురేఖ గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించిన నేత రేవంత్‌రెడ్డేనని అన్నారు. అయితే, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ఎదగాలని తానే ముందుగా కోరుకున్నానని చెప్పారు. ఇప్పుడు తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారనే భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కేలా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. చివరగా, కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను పంపిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇకపై తన అడుగు ఏ దిశలో ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పలేనని కొండా సురేఖ స్పష్టం చేశారు.